ఆగని గుండెపోటు మరణాలు.. కామారెడ్డిలో మరో యువకుడి మృతి
తాజాగా.. కామారెడ్డి జిల్లాలో మరో యువకుడు గుండెపోటుతో మరణించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన..;
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న గుండెపోటు మరణాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేదు. మీరు ముఖ్యంగా టీనేజ్ నుంచి 30-40 వయసుల లోపు యువత గుండెపోటులతో కుప్పకూలిపోయి మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్షణం కంటి ముందు నవ్వుతూ కనిపించిన కొడుకు లేదా కూతురు.. మరుక్షణాన కానరాని లోకాలకు వెళ్లిపోవడం.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తోంది.
ఈ ఆకస్మిక గుండెపోటు మరణాలకు.. పోస్ట్ కోవిడ్ లక్షణాలు కారణమని కొందరంటే.. వ్యాక్సిన్ల ఎఫెక్ట్ అని మరికొందరు అంటున్నారు. తాజాగా.. కామారెడ్డి జిల్లాలో మరో యువకుడు గుండెపోటుతో మరణించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ మరణించాడు. కామారెడ్డి జిల్లాలో గడిచిన వారం, 10 రోజుల్లో నలుగురు వ్యక్తులు గుండెపోటుతో మరణించడంతో.. జిల్లా వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.