'యూసీసీ బిల్లును వ్యతిరేకించండి'.. కేసీఆర్‌ను కోరిన ఒవైసీ బృందం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, తెలంగాణ ముస్లిం మత పెద్దల
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, తెలంగాణ ముస్లిం మత పెద్దల బృందం కలిసింది. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి చట్టం) వ్యతిరేకించాలని కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ని కలిసిన బృందంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖాలిద్ సైఫుల్లా రెహమానీ కూడా ఉన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని అసదుద్దీన్ తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు అమలు చేస్తే అనేక రంగాల ప్రజలు అన్యాయానికి గురవుతారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. యూసీసీ బిల్లు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుతో గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతారని అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరుతామని చెప్పారు.
ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని అసదుద్దీన్ విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టం బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ బిల్లుపై ఇప్పటికే పలు దఫాలుగా దేశంలో ప్రముఖులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. యూసీసీ తెస్తే హిందూ వివాహ చట్టం కూడ రద్దు కానుందని, ప్రధాని అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓవైసీ విమర్శించారు. యూసీసీ బిల్లు విషయమై దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను కలుస్తామని ఓవైసీ తెలిపారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అనే విషయాన్ని అసద్ గుర్తు చేశారు. మరోవైపు ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి గిరిజనులను మినహాయించాలని న్యాయశాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుశీల్ మోదీ చేసిన సూచనను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ స్వాగతించింది.