చేపప్రసాదం పంపిణీ ప్రారంభం.. శాఖాహారులకు ప్రత్యేక ఏర్పాట్లు

రెండురోజుల పాటు నాంపల్లిలో చేపప్రసాదం పంపిణీ తర్వాత.. పాతబస్తీ దూద్ బౌలిలోని బత్తిని నివాసంలో ..

Update: 2023-06-09 03:38 GMT

bathini brothers fish medicine

మృగశిర కార్తె సందర్భంగా.. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని సోదరులు నేటి నుండి చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు. నేడు, రేపు జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేపప్రసాదం పంపిణీ మొదలైంది. రాత్రి నుండే చేపప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల ప్రజలు నాంపల్లికి చేరుకుంటున్నారు. కరోనా కారణంగా మూడేళ్లుగా చేపప్రసాదం పంపిణీ లేకపోవడంతో.. ఈ ఏడాది ప్రజలు అధికంగా వస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపప్రసాదం పంపిణీకి 34 కౌంటర్లు, 32 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

అలాగే దూరప్రాంతాల నుండి వచ్చేవారి కోసం టాయిలెట్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి. రెండురోజుల పాటు నాంపల్లిలో చేపప్రసాదం పంపిణీ తర్వాత.. పాతబస్తీ దూద్ బౌలిలోని బత్తిని నివాసంలో వారంరోజులపాటు ఈ ప్రసాదాన్ని అందించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం అధికారులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల మంది వస్తారన్న అంచనాతో.. 5 క్వింటాళ్ల చేపప్రసాదం తయారు చేశారు. ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. శాఖాహారులకు బెల్లంతో కలిపి ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. పరగడుపున లేదా.. భోజనం చేసిన మూడు గంటల తర్వాత ఈ చేపప్రసాదాన్ని తీసుకోవాలి.
బత్తిని సోదరులు పంచే ఈ చేపప్రసాదం ఆస్థమాను తగ్గిస్తుందని నమ్మకం. అయితే ఇందులో శాస్త్రీయత లేదని జనవిజ్ఞాన వేదిక నిన్న ఆరోపణలు చేసింది. చేపప్రసాదం పంపిణీని ఆపాలని, పసుపు ముద్దతో చేపపిల్లను గొంతులో వేస్తే ఆస్థమా తగ్గుతుందని నిరూపితం కాలేదని ఆరోపించింది.


Tags:    

Similar News