అందుకే శ్వేతపత్రం విడుదల
తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే
తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే!! గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే కేవలం బురదజల్లే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే శ్వేత పత్రం విడుదల వెనుక కారణాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
విద్యుత్ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేశామన్నారు. పలువురు సభ్యులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు. డిస్కంల నష్టాలకు కారణం ఎవరో సభా సాక్షిగా ప్రజలకు తెలియజేశామన్నారు. అలాగే ఏ ప్రాజెక్టును ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు చాలా బాగా తెలుసునని చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు రాత్రికి రాత్రే జరిగేవి కావని.. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి నాలుగు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పూర్తయ్యాయని, దీంతో విద్యుత్ వచ్చిందన్నారు.
ఈరోజు ఉదయం తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడంలేదని తెలిపారు. 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు రూ.62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.