SlBC Accident : ఇక లాభంలేదు.. యంత్రాల వల్ల కావడం లేదు.. మరి ఏం చేయాలి?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాల ఆచూకీ ఇంతవరకూ లభించలేదు.;

Update: 2025-03-20 03:42 GMT
accident, seven people,  left canal tunnel, srisailam
  • whatsapp icon

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాల ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. సహాయక చర్యలు 27వ రోజుకు చేరుకున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. డీ1, డీ2 ప్రాంతాల్లో మృతదేహాలు ఉంటాయని కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ గుర్తించడంతో అక్కడ మినీ జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు. అయితే దాదాపు తొమ్మిది మీటర్ల అడుగుకు పైన బురద పేరుకు పోవడంతో దానిని తొలగించడం అంతసులువుగా కనిపించడం లేదు. కార్మికులు అక్కడ తవ్వకాలు జరపాలంటే కొంత ప్రమాదం పొంచి ఉందని ఆలోచన చేస్తున్నారు.

కార్మికులే స్వయంగా...?
ఇక యంత్రాల వల్ల కూడా కాకపోవడంతో కార్మికులు తవ్వకాలు ఆ ప్రాంతంలో జరపాలని ఉన్నతాధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక మిషన్లు నమ్ముకుని ప్రయోజనం లేదన్న భావన సహాయక బృందాల్లో కూడా వ్యక్తమవుతుంది. రోబోలను తెచ్చి రోజుకు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించే కంటే సహాయక బృందాలే స్వయంగా పూడిక తీత పనికి పూనుకోవడం మంచిదని, అయితే ఇదే సమయంలో ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు.
27 రోజులవుతున్నా...
ఇప్పటికే 27 రోజులు దాటుతుండటంతో పాటు సహాయక బృందాలు కూడా షిఫ్ట్ లు వారీగా పనిచేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించకపోవడంతో ఒకింత నీరసం ఆవహించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పన్నెండు బృందాలు 650 మంది సభ్యులు ఒకరి తర్వాత మరొకరు బృందాలుగా పనిచేస్తున్న ఏ మాత్రం ప్రయోజనం లేదు. అయితే సహాయక బృందాలు స్వయంగా పూడిక తీతను తీయాలన్నా, తవ్వకాలు జరపాలన్నా ఉన్నతాధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకున్నా కొంత ప్రయోజనం ఉంటుందని, వీలయినంత త్వరగా ఈ ఆపరేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నా ప్రభుత్వం అనుమతి కోసం అధికారులు కూడా వెయిట్ చేస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News