SlBC Accident : ఉసురు తీసిన టన్నెల్ ఉసూరుమనిపిస్తుందిగా
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏడుగురు మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం చేపడుతన్నారు. నేటికి సహాయక చర్యలు 27వ రోజుకు చేరుకున్నామృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహాలు ఉన్నాయని భావించిన గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నా ఎక్కువగా బురద పేరుకుపోవడంతో తవ్వకాలు జరపడం అసాధ్యంగా మారింది. మృతదేహాలు ఉంటాయని కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ గుర్తించినప్పటికీ ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడం ప్రమాదకరమని భావించి కొంత వెనక్కు తగ్గుతున్నారు. ఉన్నతాధికారులు కూడా కార్మికులను నేరుగా తవ్వకాలకు దించేందుకు అనుమతి ఇవ్వడం లేదు.
నెల రోజులు గడుస్తున్నా...
ప్రమాదం జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్మికుల జాడ తెలియకపోవడం, కనీసం మృతదేహాలను కూడా అప్పగించకపోవడంతో బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తప్పిపోయిన ఏడుగురు మృతదేహాల ఆచూకీ దొరకడం అంతసులువు కాదన్నది టన్నెల్ లోకి దిగిన తర్వాత కానీ సహాయక బృందాలకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒక మృతదేహం లభ్యం కావడంతో మిగిలినవి కూడా సులువుగానే లభిస్తాయని అంచనా వేసినా అందుకు విరుద్ధంగా పనులు ముందుకు సాగడం లేదు. ఉన్నతాధికారులు అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు.
కొన్ని వందల మంది...
కొన్ని వందల మంది నిరంతరం నిత్యం ఒక విధంగా టన్నెల్ లో పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ప్రాణాలకు తెగించి మరీ మృతదేహాలను బయటకు తీసి ఈ ఆపరేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ అనుకున్నది సాధించలేకపోవడంతో కొంత నిరాసక్తత పెరిగినా వారు అలుపెరగకుండా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కార్మికుల జీవితాలను బలి గొన్న టన్నెల్ పనుల్లో దాదాపు నెల రోజుల నుంచి కేవలం సహాయక చర్యలు మాత్రమే జరుగుతున్నాయి. నీటి ఊట తగ్గకపోవడం, బురద తొలగింపు కష్టంగా మారడం వల్లనే మృతదేహాల లభ్యత కష్టంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. మరి ఎన్నాళ్లుపడుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.