Heat Waves : ఎండలతో పోటీగా పెరుగుతున్న వ్యాధులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.;

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదు కావడంతో మార్చి మూడో వారంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పగటి పూట ఎండలు మండిపోతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ సమయాల్లో బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నారు.
భూగర్భ జలాలు అడుగంటి...
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా రాయలసీమలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, భూగర్భ జలాలు కూడా ఈ ప్రాంతంలో అడుగంటి పోయాయని, నీటి సమస్య కూడా పలు ప్రాంతాల్లో తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. నదులు, వాగులు ఎండిపోవడంతో తాగేందుకు నీటి సరఫరా కూడా కొన్ని ప్రాంతాలకు లభ్యతకావడం లేదు. ట్యాంకర్లలో పట్టణాల్లో నీటిని తెప్పించుకునే పరిస్థితి మార్చి నెల రెండో వారంలోనే వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. మే నెలలో అసలు పరిస్థితి ఏంటన్నది అర్ధం కాకుండా ఉందని అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
వ్యాధుల తీవ్రత ఎక్కువగా ...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాధులు కూడా ఉష్ణోగ్రతలతో పోటీ పడుతూ అదే స్థాయిలో ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వడ దెబ్బతో పాటు డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలతో ఎక్కువ మంది చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కలుషితమైన నీరు తాగవద్దని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, కనీసం రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం అందరికీ మంచిదన్న సూచనలు వైద్యులు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు ఎండలు.. అటు వ్యాధులు ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి.