ఎంపీలకు విప్ జారీ చేసిన 'బీఆర్ఎస్'
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానుంది. బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ కూడా జరగనుంది.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు రానుంది. బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ కూడా జరగనుంది. అయితే కేజ్రీవాల్‌కు ఇప్పటికే మద్దతు తెలిపిన బీఆర్ఎస్ అధిష్టానం.. నేడు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. 7, 8 తేదీలలో రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్, ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరై బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొనాలని సభ్యులను ఆదేశించింది.
ఇదిలావుంటే రాజ్యసభలో బిల్లు ఆమోదం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే.. 'గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2023'కి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీతో అధికార బీజేపీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభలో సభ్యుల బలం లేని కారణంగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎన్డీయేకు రాజ్యసభలో 106 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలనీ విపక్ష కూటమి I-N-D-I-A నిర్ణయించింది. విపక్ష కూటమికి 98 మంది సభ్యుల బలం ఉంది. ఏ పార్టీతో పొత్తులేని మరో 29 మంది సభ్యులు ఉండగా.. వీరు బీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందినవారు. బీఆర్ఎస్ ఇప్పటికే ఆప్‌కు మద్దతు ప్రకటించింది. బీజేడీ, వైసీపీ, టీడీపీలు అధికార బీజేపీతో సఖ్యతగా ఉంటున్న క్రమంలో వారి ఓటు బిల్లుకు అనుకూలంగానే ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బిల్లు అమోదం పొందాలంటే 119 ఓట్లు తప్పనిసరి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఢిల్లీలో ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లుపై రాజ్యసభలో చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియంత్రణకు సంబంధించిన ఢిల్లీ ఆర్డినెన్స్ కేసులో సింఘ్వీ సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించారు.