కేటీఆర్ భావోద్వేగం ... ఒక తండ్రి బాధ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే కేటీఆర్ ప్రచారంలో బిజీగా మారిపోయారు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రచార బాధ్యతలను ఆయన భుజానకెత్తుకున్నారు. క్షణం తీరిక లేకుండా ఇటు ప్రచారం, అటు పార్టీ నేతలతో సమావేశమవుతున్న కేటీఆర్ కు ఆయన కుమారుడు హిమాన్షు గుర్తుకొచ్చినట్లుంది. దీంతో ట్విట్టర్ లో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
మిస్సవుతున్నానంటూ...
కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కుటుంబంతో సహా వెళ్లి అమెరికాలోని విశ్వవిద్యాలయంలో హిమాన్షును చేర్చి కేటీఆర్ వచ్చారు. అయితే నెలలు గడుస్తుంది. మొన్నటి వరకూ తన చెంతనే ఉన్న కుమారుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లడంతో ఒకింత తండ్రిగా బాధపడుతూ ట్వీట్ చేశారు. హిమాన్షుతో కలసి వాకింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీనికి " ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా" అని కాప్షన్ ఇచ్చారు. పక్కనే లవ్ సింబల్ ను పెట్టారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే కుమారుడి కోసం అమెరికా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లుంది.