కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ కాపాడుకుంటా
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు తన సర్వశక్తులూ ధారపోస్తానని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలు తన వెంట ఉన్నంత కాలం ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని కేసీఆర్ తెలిపారు. ఒక రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే ఏళ్లుపడుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టు కట్టాలంటే వెంటనే సాధ్యం కాదని, కొంత కాలం పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మత పిచ్చి లేపే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ప్రజలు అప్రమత్తంగా లేకపోతే...
మతవిధ్వేషాలు, మూఢ నమ్మకాలు, ఉన్మాదంతో అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రాన్ని రెండు మూడు రోజుల్లో కూలగొట్టవచ్చని తెలిపారు. 58 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడామని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుందని ఆయన అన్నారు. మత విధ్వేషాలు రెచ్చగొడితే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అలాంటి కారణాల వల్లనే బెంగళూరులో ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయని అన్నారు. అటువంటి పరిస్థితిని తెలంగాణలో రానివ్వవద్దని ఆయన కోరారు. ప్రజలు ఈ విషయంలో ఆలోచించి జాగ్రత్త పడాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు.