కేసీఆర్ మరోసారి మహాయాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహాయాగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహాయాగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ మహా యాగం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కు యాగాలు చేయడం కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు, ఆ తర్వాత ఆయన యాగాలు చేశారు. ఇప్పుడు బీజేపీతో విభేదాలు తలెత్తిన తర్వాత మరోసారి యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గతంలో ఆయుత చండీయాగాన్ని కేసీఆర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 2014, 2018 ఎన్నికలకు ముందు కూడా ఆయన అనేక సార్లు యాగాలు చేశారు.
అప్పుడు సాధ్యం కాకపోవడంతో...
ఇప్పుడు సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇటు బీజేపీ బలోపేతం అవుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ కూడా కొంత పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. యాదాద్రి ఆలయం పునఃప్రారంభం సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వైష్ణవ రుత్వికులు, మఠాధిపతులను ఆహ్వానించి యాగం చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాకపోవడంతో తాను స్వయంగా యాగం చేయాలని కేసీఆర్ భావస్తున్నారని తెలుస్తోంది.
హిందుత్వ అజెండాను...
తెలంగాణాలో బీజేపీ హిందుత్వ అజెండా అమలు పరుస్తుంది. దీనికి ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా యాగం చేయాలని భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలను కోవడం, కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటుండటంతో ఈ యాగం చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉందట. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత యాగం చేయాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు యాగం చేసే అలవాటు ఉన్న కేసీఆర్ ఈసారి కూడా మహాయాగం చేపట్టాలని నిర్ణయించారంటున్నారు. దీనిపై ఇప్పటికే వేదపండితులతో ఆయన చర్చించారంటున్నారు. హిందుత్వ అజెండాను అమలు చేస్తున్న బీజేపీకి కేసీఆర్ యాగంతో చెక్ పెట్టాలని భావిస్తున్నారు.