Revanth Reddy : బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కు ఆ ఆఫర్ ఇచ్చా.. ఆయనే వద్దన్నారు

తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-03-17 07:17 GMT

తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. సామాజిక న్యాయం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తి నిచ్చిందన్నారు. సాగునీటి విషయంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వ్యవహరించిందన్నారు. తన్నీరు ఇంటిపేరు ఉండటంతో పన్నీరు అనుకుని మురిసిపోయారని హరీశ్ రావుపై సెటైర్ వేశారు.

నిజాంకు నకలు కేసీఆర్...
నిజాం నకలు కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పలికారన్నారు. ధర్నా చౌక్ వద్దన్న వారినే అక్కడ ధర్నా చేసేందుకు అనుమతిని తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని తెలిపారు. రాజ్యబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ పక్క రాష్ట్రం నీళ్లను దోచుకుపోతుంటే పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరికాన్ని అనుభవించారన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తాము ఏ జీవోలను దాచిపెట్టబోమని ఆయన తెలిపారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలురైన సిబ్బందితో కరెంట్ కట్ చేయించి ప్రభుత్వంపై చెడు అభిప్రాయం కల్గించే ప్రయత్నం చేస్తుందన్నారు.
రైతు బంధు కొనసాగిస్తాం...
యువతకు ఉద్యోగాల కల్పన తమ ప్రధమ ప్రాధాన్యత అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే వంద రోజులు తాను పాలనపై దృష్టి పెట్టానని, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నేటి నుంచి పార్టీపైన కూడా ఫోకస్ పెడుతున్నానని ఆయన తెలిపారు. సామాజిక న్యాయానికి మారు పేరు కాంగ్రెస్ అని, పదవుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను తాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ఉండాలని ప్రతిపాదన తెచ్చానని, అందుకు ఆయన అంగీకరించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు బంధు కొనసాగిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాగు అయ్యే భూములకు మాత్రమే భవిష్యత్ లో రైతు బంధు ఇస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News