15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్

ఓ15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు ఏ మాత్రం ఆసక్తి కనబరచలేదని కేసీఆర్ కు సమాచారం

Update: 2023-05-29 03:14 GMT

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. హ్యాట్రిక్ ను అందుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో చాలా ప్రణాళికలను రచిస్తూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సర్వేలు, నిఘా వర్గాల సమాచారం తీసుకుని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేయాలని భావిస్తూ ఉన్నారు. 'మీ అంతట మీరు పొర పాట్లు చేస్తే తప్ప.. ఈసారి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే లెవరినీ మార్చే ఉద్దేశం లేదు' అంటూ సీఎం ఇటీవల చెప్పారని తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తూ ఉన్నారు. పనితీరు సరిగా లేని వారిని ఆయన పిలిచి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టని వాళ్లపై కేసీఆర్ ఓ కంటకనిపెడుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఉండకుండా.. ఎక్కువ కాలం బయటే గడుపుతున్న వాళ్లను ఆయన పిలిచి మరీ మందలించినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం ఇప్పటికే కొందరికి పిలిపించి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఓ15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు ఏ మాత్రం ఆసక్తి కనబరచలేదని కేసీఆర్ కు సమాచారం రావడంతో వాళ్లను పక్కన పెట్టేయాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించక పోవడంతో ఆయన్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరి విషయంలో కూడా కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. స్థానికంగా పట్టు లేకపోతే కష్టమే అని ఆ నాయకులకు కేసీఆర్ సూచించారు.
వచ్చే ఎన్నికల్లో కొందరు నాయకులు తమ కుమారులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు బడా నాయకులు తాము మాత్రమే కాకుండా.. తమ కుమారులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరారని.. అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయా నాయకులు తప్పుకుని తమ కుమారులను గెలిపించుకోవాలని అనుకుంటే మాత్రం ఆలోచించి నిర్ణయం చెబుతామని చెప్పినట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడి కోసం ప్రయత్నించగా.. కుదరదని అధినేత చెప్పినట్లు తెలిసింది. ఇలా పలువురు నాయకులు తమ వారసుల విషయంలో బీఆర్ఎస్ అధినేత వద్ద చెప్పుకొన్నారు.. కానీ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు.


Tags:    

Similar News