Cold Waves : నాలుగు రోజులు హై అలెర్ట్... పగలు ఎండ.. రాత్రికి చలి
తెలంగణాలో చలి తీవ్రత తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.;

తెలంగాణాలో చలి తీవ్రత తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం పది గంటలకు బయటకు రావడానికే భయపడి పోతున్నారు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి చలిగాలుల తీవ్రత అధికమవుతుంది. మళ్లీ అర్థరాత్రి ఉక్కబోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇన్ని రకాల మార్పులను ఈ సీజన్ లోనే చూస్తున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మరింత ఎక్కువయింది.
మరింతగా పెరిగి...
రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక రోగాల వ్యాధితో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశముందని, ఇలాంటి వ్యాధులతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు చలికి వ్యాపారాలు కూడా మందగించాయని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
దట్టమైన పొగమంచు...
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు రోడ్డును కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పటాన్‌చెరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాజేంద్రనగర్ 10.5, ఖమ్మంలో 18, రామగుండంలో 12.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపైన కూడా పొగమంచుతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.