SLBC Accident : 38వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్.. అయినా దక్కని ఫలితం
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 38వ రోజున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి;

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 38వ రోజున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ నిత్యం సమీక్షలు చేస్తూ వారికి గైడెన్స్ ఇస్తున్నారు. పండగలతో సంబంధం లేకుండా కార్మికుల మృతదేహాల కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. దాదాపు 650 మంది పండగలను మానుకుని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాలను బటకు తీయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిని నిజంగా అభినందించాల్సిన విషయమే.
అనేక బృందాలు...
దాదాపు పన్నెండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ బృందాలకు జిల్లా యంత్రాంగం కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. ఒకవైపు శిక్షణ పొందిన శునకాలు, రోబోలతో పాటు మరొకవైపు అనుభజ్ఞులైన సహాయక బృందాలు ఈ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికుల మృతదేహాలను వీలయినంత త్వరగా బయటకు తీసుకు వచ్చి వారి కుటుంబాలకు అప్పగించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. వారు నిరంతరం షిఫ్ట్ ల వారీగా పనిచేస్తూ మిషన్లు, స్వయంగా తవ్వకాలు జరుపుతూ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆటంకాలు దాటుకుని...
మరొక వైపు టన్నెల్ లో నీరు ఇంకా ఉబికి వస్తూనే ఉంది. ఒకవైపు బురద పేరుకుపోయి ఉండటం, మరొక వైపు శిధిలాల తొలగింపు కూడా అసాధ్యమయింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ సహాయక బృందాలు పనిచేస్తున్నా ఇప్పటికీ మృతదేహల ఆచూకీ లభించలేదు. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు. సొరంగం లోపల ఉన్న శిధిలాలను లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటకు తరలిస్తున్నారు. కానీ వీలయినంత త్వరలోనే మిగిలిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని సహాయక బృందాలు చెబుతున్నాయి. అందుకే 38 రోజుకు చేరుకున్నా వారిలో నిరాశ లేదు. నిస్పృహ లేదు. డెడ్ బాడీస్ ను కనుగోవాలన్న తపన మాత్రమే వారిలో కనపడుతుంది.