Telangana : పెరిగిన చలి తీవ్రత.. బయటకు రాక పోవడమే బెటరట
తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలితీవ్రత పెరిగిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలితీవ్రత పెరిగిపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పన్నెండు గంటల వరకూ సూర్యుడు బయటకు కనిపించడం లేదు. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - ముంబయి జాతీయ రహదారులపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని భావించి పన్నెండుగంటలవరకూ హెడ్ లైట్లు వేసుకుని మరీ వాహనాలను నడుపుతున్నారు.
వీరంతా జాగ్రత్తగా ఉండాల్సిందే...
దీంతో పాటు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. వచ్చే రోజుల్లో మరింతగా చలి పెరిగే అవకాశముందనివాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. దీర్ఘకాలికవ్యాధులున్న వారు చలిలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మార్నింగ్ వాక్ చేయకపోవడమే మంచిదని, వాకింగ్ చేయదలచుకుంటే పది గంటల తర్వాత మాత్రమే చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో అనేక మంది ఆసుపత్రిలో చేరుతున్నారు.
వణికిపోతున్న ప్రాంతాలివే...
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, న్యాల్కల్ 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని అధికారుల తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పై చలి పంజా విసరుతుంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల లో 8.3 డిగ్రీలు*గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది. కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.6, నిర్మల్ జిల్లా పెంబి లో 9.8, మంచిర్యాల జిల్లా తపాలా పూర్ లో 12.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుఅయినట్లు అధికారులు తెలిపారు.