కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది: కిషన్ రెడ్డి

తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే

Update: 2023-12-09 07:26 GMT

తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ మజ్లిస్‌తో అంటకాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలన్నారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను కాలరాసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలోనే రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నుకోవాలన్నారు. స్పీకర్ ఎన్నికను నిలిపివేయాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మజ్లిస్ పార్టీతో ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారని ఆరోపించారు కిషన్ రెడ్డి.ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందంటూ మండిపడ్డారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది శనివారం ఉదయం కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడంపైనా చర్చించారు.


Tags:    

Similar News