ఐదు సీట్ల పంచాయతీ పెట్టిన సీపీఐ

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి

Update: 2023-09-07 12:28 GMT

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలు ఒంటరి పోరాటం చేయాలని సిద్ధమవ్వగా.. ఇంకొన్ని పార్టీలు పొత్తులతో ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీపీఐను కలుపుకుని ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని అనుకుంటూ ఉండగా.. తాజాగా సీపీఐ నుండి కాంగ్రెస్ ముందు ఓ డిమాండ్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లలో పోటీ చేయాలని సీపీఐ భావిస్తోంది. సీపీఐ ప్రతినిధులు బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో కూడిన జాబితాను అందించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పగా, కొత్తగూడెం కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. హుస్నాబాద్‌ లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉండగా.. సీపీఐ ఆ సీటు కోసం డిమాండ్ చేస్తూ ఉంది. త్వరలో ఈ ఐదు సీట్ల పంచాయతీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News