కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ
తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ..
తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా, అప్పటి నుంచి రాజకీయం మరింతగా ఊపందుకుంది. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలో బీజేపీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేస్తున్నారని, దీనిపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తమ విశ్వాసం కోల్పోయిందని, మత విద్వేషాలతో బీజేపీని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయని, ఎన్ని చేసినా ఒరిగేది ఏమి లేదని ఆరోపించారు.
అలాగే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అనే పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని, అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 4వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారా ? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఆరోపించారు. అలాగే ఆ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమని గ్యారంటీ హామీలు ఇవ్వాలని సవాలు విసిరారు.