బాబు అరెస్ట్ : బండి కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని బండి సంజయ్ అన్నారు. నేరం చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరని, కానీ అదే సమయంలో ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తిరగబడే పరిస్థిితి వస్తుందని, ఈ అరెస్ట్ తో చంద్రబాబుకు మంచి మైలేజీ వచ్చిందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
వైసీపీకి మైనస్...
చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీకి మైనస్ గా మారనుందని కూడా బండి సంజయ్ అన్నారు. ఏపీ బీజేపీ నేతల కన్నా తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ పై ఎక్కువగా స్పందిస్తున్నారు. మొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నేడు బండి సంజయ్ చంద్రబాబుకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణ పార్టీ మాత్రమే ఎక్కువగా రియాక్ట్ కావడానికి ఎన్నికలే కారణమని చెబుతున్నారు.