Telangana : నేడు రైతులకు గుడ్ న్యూస్ వారి ఖాతాల్లో లక్ష రూపాయలు
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకూ ఉన్న రుణాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. లక్ష రూపాయల రుణమాఫీని 11.42 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈరోజు వారి ఖాతాల్లో 6,098 కోట్ల రూపాయలను నేరుగా ప్రభుత్వం జమ చేయడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి...
రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో చెప్పినట్లే ఆగస్టు 15వ తేదీలోపు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ ప్రక్రియను నేటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి ట్రయల్స్ ను కూడా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అధికారులు ఎన్యుమరేషన్ పూర్తి చేశారు. దీనికి సంబంధించి 39 లక్షల రైతు కుటుంబాలు అర్హత కలిగినట్లు గుర్తించారు. మొత్తం అరవై లక్షల మంది రైతులు రెండు లక్షల రైతుల రుణమాఫీని పొందనున్నారు.
రైతు వేదికల్లో....
ఈరోజు సాయంత్రానికి లక్ష రూపాయల లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయి. ఈ నెలాఖరులోగా ఒకటిన్నర లక్షల వరకూ ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల రూపాయల వరకూ ఉన్న రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దశలవారీగా జరుగుతున్నప్పటికీ ఏకకాలంలో రుణాన్ని మాఫీ చేస్తుండటంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈరోజు రుణమాఫీ ప్రక్రియను సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో రైతు సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం కొందరు రైతులతో ఆన్ లైన్ లో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడనున్నారు.