BRSకు కోకాపేటలో 11 ఎకరాలు : హై కోర్టులో పిల్

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాలను భారత్ రాష్ట్ర సమితికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ ..

Update: 2023-07-10 15:13 GMT

భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి కోకాపేటలో 11 ఎకరాల కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఎకరం రూ.50 కోట్లు విలువ చేసే భూమిని.. బీఆర్ఎస్ కు పార్టీ కార్యాలయం కోసం రూ.3.41 కోట్లకే కేటాయించారని పిల్ లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది. కేవలం 5 రోజుల్లోనే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారని ఎఫ్ జీజీ పిల్ లో పేర్కొంది. భూ కేటాయింపులు జరిగి సుమారు రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటి వరకూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి బంజారాహిల్స్ లో కార్యాలయం ఉండగా.. కోకాపేటలో పార్టీ కార్యాలయానికి రూ.550 కోట్ల విలువ చేసే భూమిని రూ.170.5 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో కోకాపేటలో బీఆర్ఎస్ కు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీఓను రద్దు చేయాలని కోరుతూ ఎఫ్ జీజీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. వెంటనే అక్కడి నిర్మాణ పనులు జరగకుండా స్టే ఇవ్వాలని కోరింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాలను భారత్ రాష్ట్ర సమితికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ మే 20, 2023న వార్తలొచ్చాయి. కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందనేది ఆ వార్తల సారాంశం. అయితే.. దానిపై అధికారిక ప్రకటన లేదు. అప్పటి కేబినెట్ మీటింగ్ తర్వాత వివిధ అంశాలపై చర్చించినట్లు చెప్పిన మంత్రులు కోకాపేటలో భూముల కేటాయింపు విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ సెంటర్ పెడతామని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి దరఖాస్తు అందిన వారం రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయిందని సమాచారం. ఇప్పుడు మళ్లీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ వేయడంతో తెరపై కోకాపేట లో భూముల కేటాయింపు అంశం చర్చనీయాంశమైంది.



Tags:    

Similar News