తెలంగాణ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్
వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బి కేటగిరీ సీట్లు వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు;
మెడికల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్లు వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. 85 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఇకపై 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద భర్తీ చేయనున్నారు. మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల జారీ చేసింది. దీంతో తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు అధిక సంఖ్యలో సీట్లు దక్కుతాయి.
తాజా ఉత్తర్వులతో...
మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ బి కేటగిరి సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం తెలంగాణకు చెందిన విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 129,139 జీవోలను విడుదల చేసింది. దీంతో మొత్తం 24 ప్రయివేటు మెడికల్ కళాశాలలోన్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
బి కేటగిరీ కింద...
తెలంగాణలో ఉన్న మైనారిటీ, నాన్ మెనారిటీ కళాశాల్లో మొత్తం 3,750 సీట్లు ఉన్నాయి. నాన్ మైనారిటీ కళాశాల్లో 3,200 సీట్లు ఉన్నాయి. ఇందులో బి కేటగిరి కింద 1,120 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఇప్పటి వరకూ అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు. కానీ కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 952 సీీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. బీ కేటగిరీ కింద మిగిలిన 15 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పాటు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశముంటుంది.