భార్య కాపురానికి రాలేదని.. భర్త టవరెక్కాడు
ఇటీవలే వారి మధ్య చిన్నగొడవ రావడంతో దూరం ఏర్పడింది. రోజురోజుకు గొడవలు మరింత ముదరడంతో సహనం కోల్పోయిన భార్య ..
మెదక్ : భార్య కాపురానికి రాలేదనే మనస్థాపం చెందిన భర్త బీఎస్‌ఎన్‌ఎల్ టవరెక్కి హల్‌చల్ చేశాడు. అటుగా వస్తున్న జనం ఘటన స్థలం వద్ద భారీగా గుమిగూడారు. యువకుడు దాదాపు గంటసేపు టవర్‌పై ఉండి తన భార్య కాపురానికి రాకుంటే ఇక్కడి నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. వివరాల్లో వెళితే... మెదక్ జిల్లా రేగోడ్ మండలం సంగమేశ్వర్ తాండాకు చెందిన గోపాల్ నాయక్‌కు పెద్దతాండాకు చెందిన రాధతో వివాహం జరిగి పది సంవత్సరాలు గడుస్తోంది. ఇటీవలే వారి మధ్య చిన్నగొడవ రావడంతో దూరం ఏర్పడింది. రోజురోజుకు గొడవలు మరింత ముదరడంతో సహనం కోల్పోయిన భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. తన భార్య ఎంతకీ రాకపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఏం చేయాలో తెలియక స్థానికంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవరెక్కేశాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువకుడి సమస్యలపై ఆరా తీశారు. యువకుడిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఎంతకీ దిగిరాకపోవడంతో మీ అత్తా మామలతో చర్చించి కలిపేబాధ్యత మాది అంటూ పోలీసులు మాటివ్వడంతోపాటు స్థానికులు కూడా చెప్పడంతో ఆ యువకుడు కిందకు దిగాడు. ఈ మేరకు పోలీసులు కలగజేసుకొని మరీ వారి ఇరువురి కుటుంబ సభ్యులను ఠాణాకు పిలిపించి కాపురం చేసుకునేలా కుటుంబ సభ్యులతో పాటు భార్య భర్తలకు కౌన్సిలింగ్ చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తమ మాటాలతో వ్యక్తిని టవర్‌ను నుంచి దిగేలా చేశారు.
భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమని, ప్రతి చిన్న విషయానికి గొడవపటం కూడా మంచిది కాదని పోలీసులు సూచించారు. ఇకపై కలిసిమెలిసి జీవించాలని, ఏదైనా సమస్య ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మొత్తం మీద పోలీసులు భార్యభర్తల మధ్య గొడవను సర్దుమనిగేలా చేయడంతోపాటు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. టవర్ ఎక్కిన యువకుడిని మందలించి, మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించకూడదని సూచించారు. మొత్తానికి పోలీసులు దగ్గరుండి భార్యభర్తలను కలిపారు.