చేప ప్రసాదంపై మళ్లీ వివాదం.. ప్రసాదమా ? మెడిసినా ?

చేపప్రసాదం తిన్నవారిలో చాలామంది తమకు ఆస్తమా తగ్గిందని చెప్తుండటం విశేషం. అయితే ఇదే చేప ప్రసాదంపై విమర్శలు..

Update: 2023-06-08 11:15 GMT

Fish Medicine in hyderabad

మృగశిర కార్తెలో హైదరాబాద్ లో కొన్ని దశాబ్దాలుగా బత్తిని వంశస్థులు కొన్ని కోట్లమంది ఆస్థమా రోగులకు చేపప్రసాదం పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఈ ప్రసాదాన్ని తినేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఆస్థమా బాధితులు వస్తుంటారు. ఈ ప్రసాదం ఆస్థమా రోగులపై ఏ మేరకు పనిచేస్తుందో తెలియదు గానీ.. జనం మాత్రం దీనికోసం అధికంగా వస్తుంటారు. మరోసారి చేపప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. పసుపు ముద్దతో కొరమీను చేపపిల్లను కలిపి ఆస్థమా రోగులకు ఇచ్చేది మెడిసినా ? ప్రసాదమా ? అన్న చర్చ మళ్లీ మొదలైంది.

మృగశిర నెలారంభంలో తెలుగు రాష్ట్రాల్లో ఆస్తమా రోగులకు గుర్తొచ్చేది చేపప్రసాదం పంపిణీ. బత్తినిసోదరులు మృగశిర కార్తెలో ఇచ్చే ఈ చేపప్రసాదం అంత ఫేమస్. 175 సంవత్సరాలుగా ఈ ప్రసాదంను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏటా కొన్ని లక్షల మంది ఈ ప్రసాదాన్ని భారీ క్యూలైన్లలో నిలబడి మరీ స్వీకరిస్తున్నారు. చేపప్రసాదం తిన్నవారిలో చాలామంది తమకు ఆస్తమా తగ్గిందని చెప్తుండటం విశేషం. అయితే ఇదే చేప ప్రసాదంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఎలాంటి శాస్త్రీయ నిర్థారణ లేని ఈ ప్రసాదాన్ని అక్రమంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2013లో దీనిపై జనవిజ్ఞాన వేదిక హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే దీనివల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్న అంశంపై ఎలాంటి నిర్థారణ చేయలేకపోయారు. దీంతో దీన్ని ‘మందు’ అని పిలవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ ‘ప్రసాదం’ పేరుతో బత్తిన సోదరులు దీన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు.
ఈ ఏడాది కూడా చేపప్రసాద వితరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు (జూన్9) నుంచి రెండ్రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపప్రసాదం ను పంపిణీ చేయనున్నారు. చేపప్రసాదం పంపిణీకి మూడురోజుల ముందు నుండే.. యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తే కోర్ట్ దిక్కరణ కింద కేసు పెడతామంటోంది జన విజ్ఞాన వేదిక. ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేయడం సరికాదంటున్నారు. చేప ప్రసాదం పంపిణీకి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు.




Tags:    

Similar News