తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లు జారీ
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని..
రానున్న 5 రోజుల్లో తెలంగాణలో చలితీవ్రత పెరగనుంది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొమురంభీం, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి, నిర్మల్, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
రేపు (ఫిబ్రవరి 12) ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఫిబ్రవరి 13 సోమవారం నాడు హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, 14,15 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.