రెడ్ అలర్ట్.. 72 గంటలు ఇళ్ల నుంచి బయటకు రాకండి
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్
అల్పపీడనం, ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాలు సహా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) కూడా తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది.
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మేడ్చల్-మల్కాజిగిరి, జనగాం, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నారాయణపేట, జోగుళాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. భారీ వర్షాల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నీరు నిలిచే అవకాశాలుండటంతో వాహనాలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించింది.