Telangana : కేబినెట్ విస్తరణ వాయిదా...అసలు కారణాలివేనా?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలిసింది

Update: 2024-07-04 02:12 GMT

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలిసింది. హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపినా మంత్రి వర్గ విస్తరణకు ఆమోదం లభించలేదని తెలిసింది. హడావిడిగా ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సిన అవసరం లేదని పార్టీ పెద్దలు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో చర్చించినప్పటికీ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

వివిధ సమీకరణాలతో...
అయితే సామాజికవర్గాల సమీకరణతో పాటు జిల్లాల వారీగా ఆరు పోస్టులకు ఎంపిక చేయడం క్లిష్టంగా మారింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మొత్తం ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని గత కొంతకాలంగా రేవంత్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీ పెద్దలతో సమావేశమయి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే భావించారు. గవర్నర్ తో కూడా భేటీ అయి ఈరోజు మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈరోజు కేబినెట్ విస్తరణ జరగడం లేదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
అందరి అభిప్రాయాల మేరకే...
సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే మంత్రి వర్గ విస్తరణతో పాటు, నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకూ విస్తరణ ఇక లేనట్లే అనుకోవాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం కల్పించవద్దని కూడా పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తోడు సీనియర్ నేతలు ఎవరూ అసంతృప్తికి గురికాకుండా చేరికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలిసింది. తొందరపడి ఎవరనంటే వారిని పార్టీలో చేర్చుకుని కొత్త సమస్యలను తెచ్చుకోవద్దని కూడా రేవంత్ కు అధిష్టానం కొద్దిగా గట్టిగానే చెప్పినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News