Telangana : ఒక్కొక్క ఘటన.. కీలక పైళ్లు మాయమవుతున్నాయంటే....?

తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే వివిధ కార్యాలయాల్లో ఫైళ్లు మాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనను కలిగిస్తుంది

Update: 2023-12-10 03:36 GMT

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే వివిధ కార్యాలయాల్లో ఫైళ్లు మాయం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనను కలిగిస్తుంది. ఫైళ్లు మాయం చేయడానికి కారణాలేంటి? అవినీతి జరిగిందా? ఆ శాఖలో అప్పటి వరకూ జరిగిన వ్యవహారం బయటపడుతుందనే భయమా? అన్నది ఇంకా అర్థం కాకపోయినా ఫైళ్లు మాయం అవుతుండటంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీనిపై ప్రస్తుత ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే కానీ అసలు విషయం బయటకు రాదన్నది మాత్రం యదార్థం.

అవినీతి జరగకుండా ఉంటే....
లెక్కలు పక్కాగా ఉంటే.. అవినీతి జరగకుండా ఉంటే.. అసలు ఫైళ్లు మాయం చేయాల్సిన పరిస్థితి ఎందుకుంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు దగ్దమవుతుండగా, మరికొన్నింటిలో ఫైళ్లను మాయం చేసే ప్రయత్నాలు అనేక సందేహాలను కలిగిస్తున్నాయి. పర్యాటక సంస్థలో తొలుత ఫైళ్లు దగ్దమయ్యాయి. హిమాయత్ నగర్ లోని టూరిజం కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదం నిజంగా జరిగిందా? లేక కావాలని నిప్పంటించారా? అన్నది విచారణలో తేలాల్సిన అంశం. ఫైళ్లన్నీ దగ్దం కావడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. కొందరు అనుమానితులు కార్యాలయంలోకి రావడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తుండటం కూడా అనుమానాలు బలపడటానికి కారణమవుతున్నాయి
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడే...
ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించిన పశుసంవర్థక శాఖలో ఫైళ్లను మాయం చేయడానికి ఉద్యోగులే ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఉద్యోగులు దొంగలుగా ఎందుకు మారారన్నది పోలీసులే తేల్చాల్సి ఉంది. అప్పటి వరకూ తాము ఉపయోగించిన ఫైళ్లనే ఉద్యోగులు ఎందుకు దొంగిలిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. పెద్దయెత్తున నిధులు దుర్వినియోగమయ్యాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వానికే కాదు.. ప్రజలకూ అనుమానమే. వీటిపై సమగ్ర మైన విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News