Liquor Prices : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు
మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి మద్యం ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది
మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి మద్యం ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మద్యం ధరలు త్వరలో పెరగనున్నాయని తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ సిద్ధమయిందని తెలిసింది. బ్రూవరీస్ కంపెనీలు కూడా మద్యం ధరలను పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యం ధరలు పెంచడమే ఏకైక మార్గమని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. మద్యం ధరలు ఎంత పెంచినా తాగక మానరు. ఆ వ్యసనం అలాంటిది. దానిని అలవాటుగా చేసుకున్న వారు ఎంత ధరపైట్టైనా కొనుగోలు చేస్తారు.
బాటిల్ పై...
ఆ ఒకే ఒక బలహీనతతో మద్యం ధరలను పెంచడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమయినట్లు తెలిసింది. ఒక్కొక్క బాటిల్ పై ఇరవై రూపాయలు పెంచాలని నిర్ణయించింది. క్వార్టర్ బాటిల్ పై ఇరవై రూపాయలు పెంచితే ఫుల్ బాటిల్ పై ఎనభై రూపాయల వరకూ పెరిగే అవకాశముది. ఇక రానున్నది ఎండా కాలం కావడంతో బీర్ల ధరలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీర్లపై ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకూ పెంచేందుకు నిర్ణయించినట్లు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా అధికారుల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
భారీగా అమ్మకాలు...
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎప్పుడూ బాగా జరుగుతుంటాయి. దసరా పది రోజుల పాటు దాదాపు 1,100 కోట్ల రూపాయల పైగా మద్యం విక్రయాలు జరిగాయి. చలి కాలం కావడంతో బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, ఓడ్కా వంటివే ఎక్కువ సేల్ అయ్యాయి. హైదరాబాద్ మద్యం విక్రయాల్లో ప్రధమ స్థానాల్లో ఉంటుంది. ఇక్కడే రాజధానితో పాటు ఐటీ పరిశ్రమలు ఉండటం, బార్లు, వైన్ షాపులు అధికంగా ఉండటంతో హైదరాబాద్ నగరం మద్యం విక్రయాల్లో నెంబర్ వన్ గా నిలుస్తుంది. రాష్ట్రంలో సుమారు పదకొండు వందల బార్లున్నాయి. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మద్యం విక్రయాలు మరింత ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ధరలు పెంచాలని అధికారులు ప్రతిపాదన చేశారు.