అలర్ట్ : ఈ జిల్లాలకు రెండురోజులు భారీ వర్షసూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో నైరుతి, అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం..
నైరుతి రుతుపవనాలు, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో నైరుతి, అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు, రేపు ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, మూసాపేట్, బాచుపల్లి, కేపీహెచ్ బీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో.. రోడ్లు జలమయమై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.