Madhavi Latha : ఓటమి తర్వాత కనిపించకపోవడానికి కారణాలివేనా? కమలం పార్టీలో గుసగుసలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తిరిగి గెలవడంతో మాధవీలత మళ్లీ కనిపించడం మానేశారు;

Update: 2024-08-01 12:00 GMT

భారతీయ జనతా పార్టీలో ఓడినా, గెలిచినా నేతలు యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేతలు గెలుపోటములు చూడరు. పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడతారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా వ్యవహరించరు. అలా కనిపించరు కూడా. రాజకీయాల్లో కేవలం బీజేపీలో కనిపించే అరుదైన దృశ్యమే అది. అయితే పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపల్లె మాధవీలత మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత గాయబ్ అయ్యారు. ఎన్నికల సమయంలో మిగిలిన బీజేపీ అభ్యర్థులను మించిన ప్రచారం ఆమెకు సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ లభించింది.

హైదరాబాద్ స్థానంలో...
గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కానీ హైదరాబాద్ లో మాత్రం గెలవలేకపోయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తిరిగి గెలవడంతో మాధవీలత మళ్లీ కనిపించడం మానేశారు. నిజానికి మాధవీలత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో హిందూ ధర్మంపై ఆమె చేసిన ప్రసంగాలు వైరల్ కావడంతో పాటు పాతబస్తీలో తమకు సరైన నేత దొరికిందని బీజేపీ భావించింది. రాష్ట్ర స్థాయి నేతలను పక్కన పెట్టి మరీ ఢిల్లీ స్థాయిలోనే మాధవీలత పేరు హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆమెకు టిక్కెట్ రావడంతోనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
విభిన్నంగా.. వివాదాల మయంగా...
మాధవీలత ప్రచారం కూడా విభిన్న శైలిలో కొనసాగింది. వివాదాన్ని కూడా అనేకమార్లు రేపింది. ప్రార్థనాలయాలపై విల్లు ఎక్కుపెట్టినట్లు పోజులివ్వడంతో పాటు ఆమె ప్రసంగాలు కూడా వివాదాలకు దారి తీశాయి. కట్టు, బొట్టు, ఆహార్యంతో ఆమె అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఆసుపత్రికి యజమాని కావడంతో పాటు ఆమె చేసిన సేవా కార్యక్రమాలను కూడా బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకునేలా చేశాయంటారు. చివరకు ప్రధాని మోదీ కూడా మాధవీలతను ట్విట్టర్ లో ప్రశంసించారంటే ఆమె అతి తక్కువ సమయంలో మోదీ దృష్టిలో పడటంతో పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఎన్నికల ఫలితాల తర్వాత...
ఎన్నికల సందర్భంగా మాధవీలతపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ మాధవీలత జాడలేదు. ఎక్కడా ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఓటమి బాధ నుంచి తేరుకోలేదా? అంటే అది గెలిచేటంత సులువైన సీటు కాదని ఆమెకు తెలియంది కాదు. దొంగఓట్లతో తన ప్రత్యర్ధి గెలిచారని ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె ఆరోపించినప్పటికీ తర్వాత మాధవీలత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయినట్లే కనిపిస్తుంది. ఒక్కసారి సీటు వచ్చి గెలుస్తామని ఎలా అనుకున్నారన్న ప్రశ్న బీజేపీ నేతల నుంచి వినిపిస్తుంది. పార్టీలో కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని, ఇలా వచ్చి అలా వెళ్లే వారు రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే పొందుతారని, అందులో మాధవీలత ఒకరని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News