గుండెపోటుతో యువకుడి హఠాన్మరణం.. కాంగ్రెస్ నేతల సంతాపం
సోమవారం ఉదయం జిమ్ కి వెళ్లొచ్చిన శ్రీధర్ (31) ఇంట్లో పనివాళ్లకు తనకు కొంచెం ఛాతీలో నొప్పిగా ఉందని..
గుండెపోటు మరణాలు ఆగడం లేదు. ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోస్ట్ కోవిడ్ లక్షణాలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక సమయం జిమ్ లో గడపడం .. కారణం ఏదైనా కానీ.. గుండెపోటు హఠాన్మరణాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో ఖమ్మంలో మరో యువకుడు హఠాన్మరణం చెందాడు. సోమవారం ఉదయం జిమ్ కి వెళ్లొచ్చిన శ్రీధర్ (31) ఇంట్లో పనివాళ్లకు తనకు కొంచెం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి గదిలోకి వెళ్లాడు. కొదదిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీధర్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోగానే మరణించాడు.
శ్రీధర్ గతంలో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. శ్రీధర్ వారికి రెండో కుమారుడు. శ్రీధర్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు శ్రీధర్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. కాగా.. ఖమ్మం జిల్లాలో వారంరోజుల వ్యవధిలో ముగ్గురు యువకులు గుండెపోటుతో మరణించడం స్థానికులను కలవరపెడుతుంది. అల్లీపురంలో నిన్న ఉదయం గరికపాటి నాగరాజు (33) సైతం గుండెపోటుతో మరణించాడు.