Milk Tanker: పాల ట్యాంకర్ బోల్తా.. ఇక వదులుతారా చెప్పండి!
తమ గ్రామం వద్ద పాల ట్యాంకర్ బోల్తా పడడంతో నందిపాడు వాసులు
తమ గ్రామం వద్ద పాల ట్యాంకర్ బోల్తా పడడంతో నందిపాడు వాసులు బకెట్లు, డబ్బాలు, బాటిళ్లతో బయటకు వచ్చారు. దొరికిన వాళ్లు దొరికినంత పాలను తీసుకుని వెళ్లారు. డెయిరీ ఫామ్‌కు చెందిన ట్యాంకర్ 10 వేల లీటర్ల పాలతో మిర్యాలగూడ నుంచి నక్రేకల్ వైపు వెళ్తోంది. నందిపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంక్ వాల్వ్ దెబ్బతినడంతో పాలు అందులో నుండి బయటకు వచ్చాయి. ఇది గమనించిన స్థానికులు పాలను సొంతం చేసుకోడానికి పరుగులు తీశారు. డ్రైవర్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్‌తో ట్యాంకర్‌ను నిలబెట్టారు.
నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా వాహనాన్ని డ్రైవర్ వేగంగా నడపటంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడిందని తెలుస్తోంది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.