విచారణ జరుగుతుంది.. చర్యలు తప్పవు

జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాట ఘటనపై చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Update: 2022-09-22 12:41 GMT

జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాట ఘటనపై చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మ్యాచ్ టిక్కెట్ల కోసం లక్షలాది మంది యువకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారన్నారు. అనుకోకుండా జింఖానా గ్రౌండ్స్ లో చిన్న సంఘటన జరిగిందని మంత్రి అంగీకరించారు. ఆయన బీసీసీఐ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. జింఖానా గ్రౌండ్ లో జరిగిన ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తుందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

కుట్ర జరుగుతోంది....
హైదరాబాద్ ను అప్రతిష్ట పాలు చేసే కుట్ర జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దళారులు టిక్కెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పదని మంత్రి హెచ్చరించారు. ఈ నెల 25వ తేదీన జరగబోయే ఆస్ట్రేలియా - ఇండియా క్రికెట్ మ్యాచ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ కు మరిన్ని మ్యాచ్ లు వచ్చే విధంగా ఎవరైనా వ్యవహరించాలని ఆయన కోరారు. భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. టిక్కెట్ల విక్రయాల్లో హెచ్ సిఏ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలపై తీసుకుంటామని తెలిపారు.


Tags:    

Similar News