Telangana Congress : రేవంత్ కు ధీటుగా వచ్చే నేత ఎవరు? సరిపోతారా?

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పేరును ఖరారు చేశారు. త్వరలోనే పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది

Update: 2024-08-24 12:13 GMT

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పేరును ఖరారు చేశారు. త్వరలోనే పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. నిన్న కాంగ్రెస్ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్ తో పాటు భట్టి భేటీ అయి పీసీసీ చీఫ్ పదవిపై చర్చించారు. సమర్థుడైన నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కోరినట్లు తెలిసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే నేతను ఎంపిక చేయాలని కోరినట్లు సమాచారం.

అనేకపేర్లు...
పీసీపీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత రేవంత్ రెడ్డి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క దళిత సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో బీసీ సామాజికవర్గానికి ఈ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మధు యాష్కీకి హైకమాండ్ వద్ద తొలి నుంచి సత్సంబంధాలు ఉండటంతో ఆయన పేరు ఖరారు అవుతుందని అందరూ అనుకున్నారు. అంచనాలు వేశారు. అలాగే మహేశ్ కుమార్ పేరు కూడా రాష్ట్ర స్థాయి నేతలు చెప్పడంతో ఆయన పేరు కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది.
మంత్రి పేరు కూడా...
అయితే తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు కూడా వినిపిస్తుంది. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. అయితే అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి మృదుస్వభావిగా పేరుంది. కానీ ఎన్నికల సమయానికి ధీటైన నేత అవసరమని కింది స్థాయి క్యాడర్ భావిస్తుంది. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పై సూటిగా విమర్శలు చేయడమే కాకుండా ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగేలా మాటకారిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపికతోనే రాష‌్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధికారం సాధ్యమయిందని హైకమాండ్ కూడా నమ్ముతుంది. రాష్ట్ర మంతటా పర్యటించి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టగల నేతను ఎంపిక చేస్తే మంచిదని సూచిస్తున్నారు. మరి చివరకు హైకమాండ్ ఎంపిక ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి.


Tags:    

Similar News