Revanth Reddy : కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే...? ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తొలి విడతలో ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. తొలి విడతలో ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరు పదవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మంత్రివర్గంలో పదిహేడు మందికి మాత్రమే చోటు ఉంటుంది. ఇప్పటికే పన్నెండు మంది ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక ఆరుగురికి మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు ఉంటుంది. ఆ ఆరుగురు ఎవరన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సీనియర్లకు మాత్రమే...
తొలి విడతలో సీనియర్ నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. సీనియర్లతో పాటు కొత్తగా వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు వచ్చాయి. కానీ మరికొందరు వెయిటింగ్ లో ఉన్నారు. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవి గ్యారంటీ అని భావించిన వారు అనేక మంది ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు. కానీ మంత్రి పదవులు చూస్తే కొన్నే ఉన్నాయి. ఆశావహుల సంఖ్య మాత్రం చాంతాండంత ఉంది. ప్రతి ఒక్కరూ తమకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కొన్ని ప్రాంతాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో వారు కూడా తమకు ఈసారి అవకాశం వస్తుందని వారు అంచనా వేసుకుంటున్నారు.
కొన్ని ప్రాంతాలకు...
ఉదాహరణకు హైదరాబాద్ నగరమే తీసుకుంటే... ఎక్కువ శాసనసభ నియోజకవర్గాలున్నాయి. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిది. అలాంటి హైదరాబాద్ కు ఒక్క మంత్రి పదవి అయినా ఇవ్వకపోతారా? అన్న ఆశ నేతల్లో ఉంది. అయితే హైదరాబాద్ లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు. పోటీ చేసి ఓటమి పాలయిన వారికి మాత్రం మంత్రి పదవులు ఇవ్వలేరు. ఎమ్మెల్సీ స్థానాన్ని వారికి కేటాయించలేని పరిస్థితి. అలాంటి షరతును కూడా అధినాయకత్వం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేసి మరీ మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. వారెవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మళ్లీ మంత్రి వర్గ విస్తరణ కోసం అధినాయకత్వాన్ని రేవంత్ రెడ్డి సంప్రదించాల్సి ఉంటుంది. హైకమాండ్ ఎదుట జాబితా పెట్టి ఒకే చేయించుకోవాల్సి రావాల్సి ఉంటుంది.
ఈ పేర్లు ప్రముఖంగా....
ప్రధానంగా అద్దంకి దయాకర్ పేరు మలి విడత మంత్రి వర్గ విస్తరణలో వినిపిస్తుంది. అద్దంకి దయాకర్ తనకు సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేశారు. అతనికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టే అవకాశాలున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఎన్‌ఎస్‌యూఐ తరుపున ఒకరికి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం ఇవ్వాలన్న యోచనలో కూడా రేవంత్ ఉన్నారు. అదే జరిగితే విద్యార్థి సంఘ నేత పేరు ఒకటి ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే గడ్డం బ్రదర్స్ లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వారు సామాజికంగా, ఆర్థికంగా బలవంతులు కావడంతో మలి విడత మంత్రివర్గ విస్తరణలో ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరి త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. జనవరి నెల ప్రారంభం లోపే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి మొదటి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.