నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అరెంజ్‌ అలర్ట్‌ జారీ

వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా

Update: 2023-09-06 01:50 GMT

వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో సెప్టెంబర్ 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్-భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భదాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం కుండపోత వర్షం పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అక్కడక్కడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అనేక చోట్ల, హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News