పదినెలల్లోనే భవిష్యత్ ను మీరే నిర్ణయించుకోండి : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Update: 2023-02-28 08:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు విద్యాసంస్థలకు అప్పజెప్పి అధిక ఫీజులను వసూలు చేస్తూ పేదలకు విద్యను దూరం చేశారని ఆయన మండి పడ్డారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ పెట్టుబడి లాంటిదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పది శాతం పైగా నిధులను బడ్జెట్ లో విద్య కోసం కేటాయించాలని రేవంత్ రెడ్డి అన్నారు. అనేక పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. పార్టీ వారికి లబ్ది చేకూర్చడానికే ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేశారన్నారు. పది నెలల్లో మీ భవిష్యత్ మీరు నిర్ణయించుకోవాలని విద్యార్థులకు రేవంత్ పిలుపునిచ్చారు.

ఖాళీగా ఉన్న పోస్టులను...
ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను కేసీఆర్ తన పార్టీ నేతల పరం చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. విద్య ఉంటే కుటుంబమే కాదు రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యావ్యస్థలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమూల మార్పులు తెస్తామని పేర్కొన్నారు. అలాగే రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా, తన ఇంట్లో మాత్రం ఎవరినీ ఖాళీగా ఉంచకుండా అందరికీ కొలువులు ఇచ్చాడంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. యువత తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలి పోవడం ఖాయమని అన్నారు.


Tags:    

Similar News