కసరత్తు ప్రారంభమయి...
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏర్పడిన తొలి మంత్రివర్గంలో పన్నెండు మందికే స్థానం దక్కింది. మరికొందరికి అవకాశం ఇవ్వాలని ఆలోచించినా లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కలసి పనిచేసేందుకు కొన్ని ఖాళీలను కావాలని అలాగే ఉంచారు. మంత్రివర్గంపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి గత ఎన్నికల్లో ఒక్కరూ కాంగ్రెస్ నుంచి గెలవలేదు. మొన్న కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో విస్తరణ చేపట్టాలని ఆలోచిస్తున్నారు.
మిగిలిన సామాజికవర్గాల వారికి...
ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం నుంచి నలుగురు మంత్రులుండగా, ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు లెక్కన కేబినెల్ లో చోటు దక్కింది. అయితే ఈసారి విస్తరణలో మైనారిటీలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. మైనారిటీకి చెందిన వారిని ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లో చోటు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటు ముదిరాజ్ వర్గానికి చెందిన వారికి కూడా ఈసారి కేబెనెట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం లేదు. అది పార్టీ క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని భావిస్తున్నారు. అందుకే పార్టీకి గత ఎన్నికల్లో పనిచేసిన వారికే కేబినెట్ లో చోట కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.
జిల్లాల వారీగా...
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఈ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉండనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఈసారి కేబినెట్ లో ఒకరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గాల నుంచి కాకుండా ఇతర సామాజిక వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో రేవంత్ ఉన్నారు. పార్టీ కో్సం పనిచేసి త్యాగాలు చేసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎవరిని నొప్పించకుండా కేబినెట్ కూర్పు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. అయితే కేబినెట్ విస్తరణ చేసినా రేవంత్ రెడ్డి ఆ నెపాన్ని హైకమాండ్ పైనే నెట్టే అవకాశముంది. తనకు ఏమాత్రం సంబంధం లేదని, హైకమాండ్ సూచన మేరకే తాను విస్తరణ చేశానని చెప్పే అవకాశాలు ఎక్కువ. అయితే ఎక్కువ అసంతృప్తులు చోటు చేసుకోకుండా, మంత్రి పదవి రాని వారికి తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామన్న హామీ కూడా గట్టిగా ఇవ్వాలన్న నిర్ణయంతో రేవంత్ ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద అతి త్వరలోనే రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారన్న వార్త తెలిసిన వెంటనే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.