Telangana : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. షరతులివే

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది

Update: 2024-10-19 06:09 GMT

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద తొలి విడత నిధులను అందచేయనున్నారు. అందులో భాగంగా తొలి విడతగా ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్ లో 7,500 రూపాయలు జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెలాఖరుకు రుణమాఫీ ప్రక్రియను మొత్తం పూర్తి చేసిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రాధమికంగా అధికారులను నిధులను సిద్ధం చేయాలని సూచించింది.

మంత్రి వర్గ సమావేశంలో...
ఈ నెలలోనే జరిగే మంత్రి వర్గ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసాను అమలు చేయలేదన్న అపప్రధను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. విపక్షాలు సయితం దీనిపై తరచూ విమర్శలు చేస్తున్నాయి. అయితే వరసగా ఒక్కొక్క హామీని అమలు పర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫస్ట్ నుంచి తంటాలు పడుతూనే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆచి తూచి అడుగులు వేస్తూ అమలు చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఆరువేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల...
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో రైతులను మంచి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాను దీపావళి తర్వాత అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరుకు రైతు రుణ మాఫీని పూర్తి చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 31 వేల కోట్ల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. మిగిలిన మొత్తం ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అదే సమయంలో రైతు భరోసా నిధులను కూడా తొలివిడత నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దీంతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి చాలా వరకూ పోతుందని భావిస్తుంది. దీపావళి తర్వాత రైతు భరోసాను అమలు చేయాలని ఈ నెల 23వ తేదీన కేబినెట్‌లో డిసైడ్ చేయనుంది.
మంత్రి వర్గ ఉప సంఘం...
మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా ఇవ్వనున్నారు. కేవలం పంటలు వేసిన భూములకే రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంటలు వేయని భూములకు కూడా రైతు భరోసా ఇచ్చిందని, అయితే తమ ప్రభుత్వం మాత్రం పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. డిసెంబరు నాటికి రుణమాఫీ పూర్తి అయిన వెంటనే రైతు భరోసాను కూడా ఎకరాకు 7,500 రూపాయలు ప్రకటిస్తామని తెలిపారు.



Tags:    

Similar News