Telangana : గడీల నుంచి గ్రామాల్లోకి పాలన : రేవంత్ రెడ్డి
ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామమని రేవంత్ రెడ్డి అన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాలలో, మున్సిపాలిటీ వార్డుల్లో, పట్టణాల్లో, నగరాల్లో గ్రామసభలను ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ గ్రామ సభలను నిర్వహిస్తామని తెలిపారు. నిస్సహాయులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అత్యంత నిరుపేదలకు కూడా తండాలు, గూడేల్లో ఉంటున్న వారికి కూడా ఈ సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో నేరుగా వారి వద్దకే ప్రభుత్వం వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
పాలనను చేరువ చేయడానికే...
ప్రజలకు పాలనను చేరువ చేయడానికే వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణిని ఏర్పాటు చేశామన్నారు. ప్రజావాణి ద్వారా ఇప్పటి వరకూ 24 వేల వరకూ దరఖాస్తులు అందాయని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కు వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే వారి వద్దకు వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఉండి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికే గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో గడీలలోపు జరిగిన పాలనను గ్రామాలకు తీసుకెళుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
అర్హులైన అందరికీ...
ఏ సంక్షేమ పథకమైనా అర్హులైన లబ్దిదారులు అందరికీ అందించాలన్నా... ప్రభుత్వానికి కొన్ని లెక్కలు తెలియాలన్నా అనుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకునేందుకు గ్రామసభల ద్వారానే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేయాలని ఆలోచనతో ఈ ప్రజాపాలనను కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలను విధిగా సందర్శించి గ్రామ సభలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామసభలు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని, ప్రజలు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన సమస్య పరిష్కరించలేదని మాజీ మంత్రి కేటీఆర్ లక్ష రూపాయలు మహిళకు ఇవ్వడంతోనే ప్రజావాణి సక్సెస్ అయిందన్నారు. లక్షల కోట్లు సంపాదించిన కల్వకుంట్ల కుటుంబం పేదరాలికి లక్ష రూపాయలు ఇప్పించడమంటే ప్రజావాణి సూపర్ సక్సెస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు.