తొలి ప్రభుత్వ ఉద్యోగం ఆమెకే.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి. ఇందులో భాగంగా మొదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి..
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి. ఇందులో భాగంగా మొదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ చీఫ్ గా రేవంత్ అభయ హస్తం అందించారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయబోతున్న వేళ.. స్వయంగా గ్యారంటీ కార్డ్ రాసి ఇచ్చిన రజినీకి ఉద్యోగం ఇవ్వబోతున్నారు.
పీజీ పూర్తి చేసినా.. అటు ప్రైవేట్లో.. ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ.. రేవంత్ రెడ్డిని కలిసి ఆవేదనను వ్యక్తం చేశారు. రజినీ బాధను సావధానంగా విన్న రేవంత్.. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా, రాహుల్, ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున.. వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అని రేవంత్ రాసిచ్చారు.
రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రజినీకి తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు. రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజినీకి ఆహ్వానం కూడా పంపించారు. సీఎం ప్రమాణం స్వీకారానికి హాజరు కావడంతో పాటు ఉద్యోగం కూడా వస్తుండటంతో రజినీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.