Temperatures : ఎండలు.. వడగాలులు.. మార్చి నెలలోనే మాడు పగిలిపోతుందే?
ఎండలు మండి పోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఎండలు అదరగొడుతున్నాయి. మార్చి నెలలోనే మాడు పగలేలా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు మండే ఎండలు.. మరొక వైపు ఉక్కపోత ఇటు ఇంట్లో ఉండనివ్వడం లేదు. బయటకు రానివ్వడం లేదు. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం పది గంటలు దాటితే ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. గత రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది.
మార్చి నెలలోనే...
ఇంత స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు గతంలో మార్చి నెలలో నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి చివరి నాటికే నలభై డిగ్రీలు దాటిపోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు. మరో మూడు రోజులు ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని అంటున్నారు. బయటకు వచ్చే వారు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ డీ హైడ్రేషన్ కు లోను కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు...
సాధారణ డిగ్రీలతో పోలిస్తే ఇప్పటికే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత అధికమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.