తెలంగాణలో పెరిగిపోతున్న కండ్ల కలక కేసులు
కండ్ల కలక వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుంది. అడెనోవైరస్
ఇటీవల కురిసిన వర్షాల తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక విజృంభిస్తోంది. ప్రజలు చేతులకు సంబంధించి పరిశుభ్రత పాటించాలని, కంటి ఇన్ఫెక్షన్ నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కండ్లకలక సంక్రమణను నిరోధించడానికి, ప్రజలు టవల్స్ వంటి వాటిని వాడుతూ ఉండాలని అన్నారు. ఇప్పటికే కండ్ల కలక సోకినా ప్రభావిత వ్యక్తులు ఉపయోగించే ఇతర వ్యక్తిగత వస్తువులను తాకడం మానుకోవాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం వలన వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమణ వ్యాప్తిని తగ్గించవచ్చు.
కండ్ల కలక వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుంది. అడెనోవైరస్ వంటి ఒక ప్రత్యేక వైరస్‌ల సమూహంతో ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. ఇది అంటు వ్యాధి అని, వ్యాధి సోకిన వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచించారు. కండ్లను తాకవద్దని, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలిపారు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కను రెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే గనక కళ్ల నుంచి నలక ఎక్కువగా రావొచ్చు. కంట్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల వీటినుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. ఈ లక్షణాలు తగ్గడానికి వారం నుంచి రెండు వారాల సమయం పట్టొచ్చు.