బీజేపీ టికెట్ల కోసం 119 నియోజకవర్గాలకు 6 వేల దరఖాస్తులు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు..

Update: 2023-09-11 12:01 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో స్పీడ్ పెంచాయి. ప్రధానంగా.. తెలంగాణలో బీజేపీ వేగం పెంచింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురవేయాలని కమలం భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహాలు రచిస్తోంది.. సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. ఈ క్రమంలోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్‌లకు భారీ పోటీ నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేవారి దరఖాస్తులు వరదలా వచ్చి చేరుతున్నాయి. ఆశావహుల నుంచి గత వారం రోజులుగా బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. నిన్నటితో అప్లికేషన్స్‌కు గడువు ముగిసింది. అయితే.. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. 119 సీట్లకు 6వేలకు పైగా దరఖాస్తులు రావడం ఆసక్తి రేపుతోంది.

సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది బీజేపీ. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 6003 అప్లికేషన్లు వచ్చి చేరాయని బీజేపీ నేతలు చెప్పారు. చివరి ఒక్కరోజే 2,781 దరఖాస్తులు రావడం ఆసక్తిగా మారింది. అయితే.. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహులు భారీగా పోటీ పడ్డారు. ఒక్కొక్కరూ 3, 4 స్థానాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్న స్థానం దక్కకపోతే మరో చోటైన అవకాశం దక్కుతుందనే ఆశతో అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏడు రోజుల్లో మొత్తం.. 6003 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు.. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు సినీనటి జీవిత రాజశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలకు జీవిత రాజశేఖర్ దరఖాస్తు చేశారు. అయితే తొలి రోజే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించగా.. గడువు ముగిసే నాటికి వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయనుకున్నారు. కానీ.. అనూహ్యంగా.. 6వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ దరఖాస్తులను బీజేపీ మూడు దశల్లో వడపోత కార్యక్రమం చేపట్టనుంది. దరఖాస్తుల కోసం ఓ కమిటి వేసి తుది జాబితాను సిద్ధం చేస్తామని తెలంగాణ బీజేపీ చెబుతోంది.
Tags:    

Similar News