నిర్మల్ లో కేసీఆర్ ర్యాలీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్ 4న నిర్మల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాలో జూన్ 4న పర్యటించి నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 5 కిమీ దూరంలో ఉన్న ఎల్లపల్లె గ్రామ శివారులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్‌లో సభ నిర్వహిస్తున్నామని, గత తొమ్మిదేండ్లుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జూన్ 2 వరకు అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.