Telangana : కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ ఘాటు విమర్శలు
గత ప్రభుత్వం అప్పుల మయం చేసి రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు
గత ప్రభుత్వం అప్పుల మయం చేసి రాష్ట్రాన్ని తమకు అప్పగించిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ను ప్రసంగించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేసిన గత ప్రభుత్వం తమకు ఖాళీ ఖజానాను అప్పగించిందన్నారు. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని అన్నారు. ప్రజలపై ఎలాంటి ఆర్థికభారం మోపకుండా తాము ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు.
రెండు గ్యారంటీలను...
ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. ప్రజాపాలనలో తమకు 1.8 కోట్ల వరకూ దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు నేడు లభించాయని అన్నారు.
కంచెను తొలగించాం...
అధికారంలోకి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న కంచెను తొలగించామని గవర్నర్ తెలిపారు. కాళోజీ నారాయణ కవితతో ప్రారంభించిన గవర్నర్ ప్రసంగం దాదాపు నలభై నిమిషాల పాటు సాగింది. ఇపపటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని, మరో రెండు గ్యారంటీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును ఇస్తామని ఆమె చెప్పారు.