Congress : చిచ్చురేపిన టిక్కెట్ .. కీలక నేత అవుట్?
కాంగ్రెస్‌లో మూడో జాబితా అసంతృప్తిని రాజేసింది. మూడో జాబితాను 16 మంది అభ్యర్థులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్‌లో మూడో జాబితా అసంతృప్తిని రాజేసింది. మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం 16 మంది అభ్యర్థులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పటాన్ చెర్వు టిక్కెట్ ను నీలం మధుకు కేటాయించడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి తో ఉన్నారు. ఆయన తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా పటాన్ చెర్వు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. బోధ్, చెన్నూరు, ఆదిలాబాద్, ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో పార్టీని వీడే అవకాశాలున్నాయని తెలిసింది.
కొత్తగా పార్టీలో చేరిన...
అయితే శ్రీనివాస్ గౌడ్ ను కాదని పార్టీ అధినాయకత్వం నీలం మధుకు టిక్కెట్ కేటయించింది. మూడో జాబితాలో ఈ పేరు ఖరారు కావడంతో దామోదర రాజనర్సింహ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు కాటా శ్రీనివాస గౌడ్ అనుచరులు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరి వెళ్లారు. తాను పార్టీకి రాజీనామా చేస్తానని రాజనర్సింహ సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. మరి ఆయనను హైకమాండ్ బుజ్జగిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.