Tomato : టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగిరావట.. నోటికి తాళం వేసుకోవాల్సిందే

టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే టమాటా ధరలు వంద రూపాయల వరకూ చేరుకుంది

Update: 2024-06-29 06:25 GMT

టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే టమాటా ధరలు వంద రూపాయల వరకూ చేరుకుంది. రైతు బజార్లలో కిలో టమాటా ధర ఎనభై నుంచి డెబ్బయి రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. బయట మార్కెట్ లో ఎక్కువ ధర పలుకుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది టమాటా దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఉన్న కొద్ది టమాటాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో ఒక్కసారిగా ధరలు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా లేనిదే వంటింట్లో ఏ పని జరగదు. ఏ వంట చేయలేని పరిస్థితుల్లో వినియోగదారులున్నారు.

మిగిలిన కూరగాయలు...
టమాటా ధరలతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఆలుగడ్డ మినహా మిగిలిన అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. టమాటా ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. కిలో ఎనభై రూపాయల వరకూ విక్రయిస్తుండటతో తమకు అవసరమైన మేరకే టమాటాను కొనుగోలు చేస్తున్నారు. ఇక పత్తికొండ, మదనపల్లి మార్కెట్ కు కూడా తక్కువగానే టమాటాలు వస్తున్నాయి. అయితే రైతులకు మాత్రం కొంత లాభం చేకూరుతున్నప్పటికీ రైతుల నుంచి వినియోగదారులకు చేరుకునే సరికి ధర మరింత ఎక్కువవుతోంది. దీనిన భరించలేకపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు.
సెప్టంబరు నాటికి...
అయితే టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగిరావని వ్యాపారులు చెబుతున్నారు. సెప్టంబరు నాటికి కాని ధరలు తగ్గవని చెబుతున్నారు. అప్పుడే పంట చేతికి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకూ ధరలు పెరుగడమే కాని తగ్గడం అంటూ జరగవని రైతులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం వేసిన పంట చేతికి అందేసరికి సెప్టంబరు అవుతుందని,అప్పుడే ధరలు తగ్గుతాయని, అప్పటి వరకూ టమాటాను రుచి చూడటం కూడా కష్టమేనని వినియోగదారులు వాపోతున్నారు. టమాటా ఇటు కొనలేక.. అటు కొనకుండా ఉండలేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. టమాటా ధరలు మరింత ప్రియమవుతాయన్నది వ్యాపారులు చెబుతున్న మాట


Tags:    

Similar News